-
-
By Chowdary
Updated :
21 November 2025 10:18 AM
భూపాలపల్లి కలెక్టరేట్, న్యూస్‌టుడే: పంచాయతీల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నాయి. వీటికి తోడు పంచాయతీలు వాటి పరిధిలోని గ్రామాల్లో వసూలయ్యే పన్నుల ద్వారా అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతి ఆర్థిక సంవత్సరంలో పంచాయతీల వారీగా లక్ష్యం నిర్దేశించుకుని, ఆ లక్ష్యం ప్రకారం వసూళ్లు చేయాలి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా రూ.4.28 కోట్ల పన్నులు లక్ష్యం కాగా.. ఇప్పటివరకు రూ.88.68 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలల్లో ముగియనుంది. ఈ క్రమంలో వందశాతం వసూళ్లకు చాలా దూరంలో ఉండటంతో.. సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీలు ఇంటి పన్నుతో పాటు సంతలు, లైసెన్స్‌లు, బంజరుదొడ్డి తదితర వాటిపై ఏటా డిమాండ్‌ను రూపొందించి దాని ప్రకారం ముందుకెళ్లాలి. పన్నుల రూపేనా వచ్చిన నగదును ట్రెజరీలో జమచేసి పంచాయతీకి సంబంధించిన చిన్నచిన్న అవసరాలు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల వేతనాల చెల్లింపు, గ్రామంలో చిన్నచిన్న మరమ్మతులు చేయించడం, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, గ్రామసభల ఏర్పాటు, స్టేషనరీ తదితర వాటికి ఇందులోంచి వెచ్చించాల్సి ఉంటుంది.