-
-
By Chowdary
Updated :
20 November 2025 06:34 PM
అప్పటివరకూ గల్లీలో క్రికెట్ ఆడినా... అందులో భవిష్యత్తు ఊహించుకోలేదు. కానీ, ఓ పత్రికా ప్రకటన ఆమె ప్రయాణాన్ని మలుపు తిప్పింది. లేటు వయసులో సెలెక్షన్స్కి వెళ్లి విశాఖ జిల్లా క్రికెట్ జట్టుకి ఎంపికయ్యారు కోసన కల్యాణి. ఇప్పుడు బీసీసీఐ నుంచి ఆంధ్ర క్రికెట్కు లెవెల్-1 సహాయ కోచ్గా సేవలందిస్తున్నారు.
చిన్నప్పటి నుంచీ నాకు ఆటలంటే ఇష్టం. స్కూల్ స్థాయిలో ఎన్నో ప్రైజులూ అందుకున్నా. వీధిలో అన్నయ్య, స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటం నాకెంతో సరదా! కానీ, అందులోనే ఎదగాలని ప్రత్యేకంగా ఎప్పుడూ అనుకోలేదు. డిగ్రీ చదివేటప్పుడు... జిల్లా మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పత్రికల్లో ప్రకటన వచ్చింది. అన్నయ్య దాన్ని చూపించి... రోడ్డు మీద ఆడటం కాదు... అక్కడ నిరూపించుకో అన్నాడు. అది 2006. అప్పటికి మహిళా క్రికెట్కు అంత ఆదరణ లేదు. అయినా హాజరయ్యా. బౌలర్ బంతి వేయగానే గట్టిగా కొట్టా.. అది చాలా దూరం వెళ్లి... కాలేజీ కిటికీని తాకింది. గ్లాసు పగిలింది. అప్పటివరకూ ఎవరూ అలా కిటికీ అద్దాల్ని పగలగొట్టలేదన్నారు. శక్తిని ఉపయోగించి కొట్టిన ఆ బంతి దెబ్బకు విశాఖ జిల్లా జట్టులో స్థానం సంపాదించగలిగా. అదీ 19 ఏళ్ల వయసులో. చాలా ఆలస్యంగా ఇందులోకి అడుగుపెట్టా. ఆ తర్వాత అనంతపురంలో జరిగిన ఇంటర్ స్టేట్ మీట్లో పాల్గొన్నా.