-
-
By Chowdary
Updated :
20 November 2025 06:34 PM
భూముల ధరలు ఆకాశాన్ని అంటుతోన్న రోజులివి. సెంటు భూమిని వదులుకోవడానికీ ఆలోచిస్తారు. అలాంటిది రూ.లక్షలు విలువ చేసేదాన్ని ఎవరైనా వదులుకుంటారా? కానీ ఆత్రం లేతుబాయి ఇచ్చేశారు. అలాగని తనేమీ లక్షాధికారి కాదు... చిన్న గుడిసె ఆమె నివాసం.
ఆదిమ గిరిజనులు... వీళ్లు ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలోనే కనిపిస్తుంటారు. ఆ తెగకు చెందినవారే లేతుబాయి. ఆదిలాబాద్ జిల్లాలోని దుబ్బగూడ (ఎస్) గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన సాహెజ్ ఈమె ఊరు. ఇటీవల అక్కడి 16మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. కొందరు నిర్మాణ పనులూ చేపట్టారు. కానీ వారిలో 10మందికి సొంత స్థలం లేకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. అప్పుడు వాళ్లంతా లేతుబాయిని స్థలం కోసం ఆశ్రయించారు. తహసీల్దార్ నుంచి విషయం తెలుసుకున్న ఆమె ‘నా ఎకరం భూమి తీసుకోండి. ప్రతిఫలంగా నాకేమీ డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. స్థలాలు లేనివాళ్లందరికీ దానిలో ఇల్లు కట్టించి ఇవ్వండి’ అని చెప్పారు. అలా రాయించిన అఫిడవిట్ మీద సంతకం పెట్టి, స్వయంగా తహసీల్దార్కీ అందించారు. ఆమె చర్య ఎంతోమందిని ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి లేతుబాయికి పక్కా భవనం లేదు. ఆమె నివసించేదీ చిన్న పూరింట్లో. వ్యవసాయాధారిత కుటుంబం. ఈమెకు ముగ్గురు అబ్బాయిలు. ఒకరు కూలీపనులు చేస్తూ, మరొకరు తాపీ మేస్త్రీగా, ఇంకొకరు ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆమె అలా భూమి ఇచ్చినా భర్తకానీ, కొడుకులు కానీ అడ్డు చెప్పలేదట. ‘సొంతిల్లు చాలామంది కల. ప్రభుత్వం నుంచి ఆ అవకాశం వచ్చింది. కానీ స్థలం లేదని తోటివాళ్లు ఎక్కడ ఇల్లు కట్టుకోలేరో, తరవాత ఈ కారణంగా ఎక్కడ గొడవలు పడతారోనని భయమేసింది. మా వాళ్లంతా ఐకమత్యంగా ఉండాలనేది నా కోరిక. నేనొక్కదాన్ని కొంత భూమి వదులుకుంటే అందరం ఒకేచోట కలిసి మెలసి ఉండొచ్చు అనిపించింది. అందుకే నా పేరిట ఉన్న ఎకరం పొలం సంతోషంగా ఇచ్చేశా’ అంటోన్న లేతుబాయి పెద్ద మనసుకి జోహార్ చెప్పాల్సిందే!