-
-
By Chowdary
Updated :
19 November 2025 11:42 AM
దిల్లీ: అధిక దిగుబడినివ్వడంతోపాటు వంటకాలకు మంచి రుచిని జోడించే ‘సాస్-కెవు’ అనే కొత్త అల్లం రకాన్ని నాగాలాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది రైతులు, ఆహార పరిశ్రమకు మెరుగైన ప్రత్యామ్నాయమవుతుందని భావిస్తున్నారు. ఈ వంగడాన్ని ఆంధ్రప్రదేశ్లోని చింతపల్లి సహా దేశంలోని భిన్న ప్రాంతాల్లో విస్తృతంగా పరీక్షించారు. ఇది హెక్టారుకు 17.21 టన్నుల దిగుబడిని ఇస్తుందని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతమున్న ప్రామాణిక వంగడంతో పోలిస్తే ఇది 9 శాతం ఎక్కువ దిగుబడిని ఇచ్చిందన్నారు. దీని డ్రై రికవరీ రేటు 21.95 శాతంగా ఉందని వివరించారు. అందువల్ల అల్లాన్ని ఎండబెట్టాక అధిక దిగుబడిని కోరుకునే ప్రాసెసింగ్ సంస్థలకు ప్రయోజనం కలిగిస్తుందని తెలిపారు. భూమిలోపలి దీని కాండం మృదువుగా, పెద్దగా ఉంటుంది. లోపలి గుజ్జు నిమ్మపండు రంగులో ఉండి, తక్కువ పీచును కలిగి ఉంటుంది. అది పచ్చళ్లు, పానీయాలు, వంట, ఇతర ఉత్పత్తులకు అనువైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, పశ్చిమ బెంగాల్లో ఈ వంగడం విత్తనోత్పత్తి, వ్యవసాయ విక్రయాలకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.