-
-
By Chowdary
Updated :
20 November 2025 10:20 AM
దిల్లీ: సొంతంగా ఆస్తులు ఆర్జించిన వివాహిత హిందూ మహిళలు.. భర్త, పిల్లలు లేకపోతే వీలునామా రాయాలని సుప్రీంకోర్టు సూచించింది. తద్వారా భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు, వ్యాజ్యాలు తలెత్తకుండా ఉంటాయని పేర్కొంది. ‘‘మహిళలు సొంతంగా ఆస్తులు ఆర్జిస్తారని హిందూ వారసత్వ చట్టం-1956 రూపొందించేటపుడు ఊహించలేదు. గత కొన్ని దశాబ్దాలుగా మహిళలు పురోగతి సాధించారు. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణిస్తూ సొంతంగా ఆస్తులు సంపాదించుకుంటున్నారు. భర్త చనిపోయి పిల్లలు లేకుండా హిందూ మహిళ మరణిస్తే ఆమె ఆస్తులు భర్త వారసులకు వెళుతున్నాయి. ఇది మహిళల తల్లిదండ్రుల కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది’’ అని జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఆర్.మహాదేవన్‌ల ధర్మాసనం పేర్కొంటూ చట్టంలోని సెక్షన్ 15(1)(బి)ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని తిరస్కరించింది. ఈ సెక్షన్ ప్రకారం, పెళ్లైన హిందూ మహిళ వీలునామా లేకుండా చనిపోతే తల్లిదండ్రుల కంటే ముందు భర్త వారసులకు ఆమె ఆస్తిని పంచుతారు. పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది... సెక్షన్ 15(1)(బి) ఏకపక్షంగా ఉందని, రాజ్యాంగంలోని 14, 15, 21 అధికరణాలకు వ్యతిరేకంగా ఉందని తెలిపారు. ఒకవేళ మహిళ వీలునామా రాయకుండా చనిపోతే.. సంబంధిత పక్షాలు వ్యాజ్యం దాఖలు చేసే ముందు మధ్యవర్తిత్వ ప్రక్రియ ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని ధర్మాసనం సూచించింది.