-
-
By Chowdary
Updated :
19 November 2025 11:44 AM
దిల్లీ: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ద్వారా ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష పార్టీలను ధ్వంసం చేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) కుటిల పన్నాగం పన్నిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. దీనిపై డిసెంబరు మొదటి వారంలో దిల్లీలోని రాంలీలా మైదానంలో నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఓట్ల చోరీ అంటూ ఇప్పటికే ఈసీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ.. ఇప్పుడు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్న సర్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. కొంత మంది ఓటర్లను లక్ష్యంగా చేసుకుని వారిని తొలగించేందుకు సర్ ద్వారా ఈసీ కుట్ర చేస్తోందని, ఆ ప్రక్రియ భాజపా కనుసన్నల్లో జరగడం లేదని ఎన్నికల సంఘం నిరూపించుకోవాలని డిమాండు చేసింది. మంగళవారం దిల్లీలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలతో సర్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు, పార్టీ రాష్ట్రశాఖల అధ్యక్షులు, కాంగ్రెస్ శాసనసభాపక్షాల నేతలు, కార్యదర్శులు పాల్గొన్నారు. సమావేశానంతరం వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఓటర్ల జాబితా సమగ్రతను కాంగ్రెస్ పార్టీ రక్షిస్తుందని సమావేశానంతరం ఎక్స్‌లో ఖర్గే స్పష్టం చేశారు.